హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా ధరల పెరుగుదలతో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో రూ.994కు చేరింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోనే అత్యధిక ధరలు ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సిలిండర్‌పై ఏకంగా రూ.89 వరకు భారం పెరగడంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల ఒడిదొడుకుల వల్లే ఈ ధరల సవరణ జరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.