రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని చంపిన నిందితుడు రాజ్‌కుమార్ ఉన్మాదానికి వెనుక భయంకరమైన అప్పుల కూపం, విడాకుల వివాదమే ప్రధాన కారణాలని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తనకంటే ఆరేళ్లు పెద్దదైన, తనకు పాఠాలు నేర్పిన ట్యూషన్ టీచర్ సరితను ప్రేమ పేరిట వేధించి 2018లో బలవంతంగా పెళ్లాడిన రాజ్‌కుమార్.. ఆ తర్వాత జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. కొడుకు ఆత్మహత్య డ్రామాలకు భయపడి తల్లిదండ్రులు తమ ఆస్తులన్నీ అమ్మేసినప్పటికీ.. డ్రగ్స్ మైకంలో మునిగిపోయిన అతడు ఏకంగా రూ.2 కోట్ల వరకు అప్పులు చేశాడు. నిత్యం భార్యను వేధిస్తూ చుక్కలు చూపించేవాడు. ఈ నరకం భరించలేక సరిత తీవ్ర విరక్తితో విడాకులు ఇవ్వాలని భర్తను గట్టిగా నిలదీయడంతోనే.. అతడు కట్టుకున్న భార్యను చంపినట్లు పోలీసులు గుర్తించారు.