హైదరాబాద్ రూపురేఖలను మార్చే ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు తొలి విడత పనుల కోసం రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులలో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి రూ.4,500 కోట్ల రుణం తీసుకోనుండగా.. మిగిలిన రూ.2,845.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే గ్రాంట్ రూపంలో భరించనుంది. ఈ బడ్జెట్‌లో భూసేకరణ ఖర్చులను మినహాయించారు. ఈ పనులను ఈపీసీ విధానంలో చేపట్టనున్నారు.