ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అనంతపురం జిల్లా హుస్సేనుపురంలో గరిష్ఠంగా 51 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల వల్ల కొన్నిచోట్ల వేడి తగ్గినప్పటికీ.. ఆదివారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీ సెల్సియస్ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే 17 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.